KTR: కోతలు , కూతలు కాదు..చేతలు కావాలి...! 10 d ago
సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు..పథకాల అమలు కావాలి.. కోతలు కాదు, కూతలు కాదు..చేతలు కావాలని చురకలంటించారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఉదరగొట్టారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు.
అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని, ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదని..మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదని వ్యాఖ్యానించారు. అధికారం కోసం అబద్దాలు..అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు వెతుకుతున్నారని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను..ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారని మండిపడ్డారు.
ఇప్పటికైనా కల్లు తెరవండని సూచించారు. వర్షం కురుస్తుందో? లేదో? సాగునీరు అందుతుందో? లేదో? కరంటు వస్తుందో? లేదో? పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో ? లేదో? తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి .. ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వండని కోరారు. అమ్మల విషయంలో అన్నదాతల విషయంలో వివక్ష చూపకండని..పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకకండని పేర్కొన్నారు.